సినిమా ఇండస్ట్రీలో ఆది నుంచీ ఒక ఆనవాయితీ ఉంది. అదేమంటే.. ఒక జంట నటించిన సినిమా సక్సెస్ అయ్యిందంటే వారికి హిట్ పెయిర్ అని పేరుపెట్టి, అదే జంటతో వరుసగా చిత్రాలు నిర్మించడం. ఇది ఎంతవరకూ ఆరోగ్యం, అనారోగ్యం అనే మాట అటుంచితే దీనికి ముఖ్య కారణం నిర్మాతలే. ప్రేక్షకులు కూడా అదే జంటను చూడ్డానికి ఇష్టపడి ఆ జంట కాంబినేషన్‌లో సినిమాలు రావాలని కోరుకుంటారు.
అదేవిధంగా సురేశ్, నదియా జంటగా నటించిన ఒక తమిళ చిత్రం సక్సెస్ కావడంతో, వరుసగా వారి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయి. వాళ్లిద్దరూ కలిసి ప్రతి సినిమాలో కనిపిస్తుండటం చూసి, వాళ్లిద్దరి మధ్యా లేని సంబంధాన్ని సృష్టించి, సురేశ్-నదియా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారంలోకి వచ్చింది. ఇందులో అప్పటి తమిళ పత్రికలూ భాగమయ్యాయి. "నిజానికి మేమెప్పుడూ ఆ సంగతి ఆలోచించలేదు. ఆ ఉద్దేశం కూడా మాకు లేదు. కాకపోతే మేం మంచి స్నేహితులం. చాలా సన్నిహితంగా ఉంటాం." అని ఒక సందర్భంలో సురేశ్ వెల్లడించారు.
ఇలా వదంతులు వస్తున్నాయనే ఉద్దేశంతో, అప్పట్నుంచీ సురేశ్ ఒకే హీరోయిన్‌తో నటించకుండా ఒక్కో సినిమాలో ఒక్కో హీరోయిన్‌తో నటిస్తూ వచ్చారు. నదియా కాంబినేషన్‌లో మళ్లీ నటించే అవకాశం వచ్చినా, ఆయన చేయలేదు. ఇలా ప్రచారంలోకి వచ్చిన కొద్ది కాలానికే 1988లో శిరీష్ గాడ్‌బోలే అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుని, సినిమాలకు గుడ్‌బై చెప్పి, అమెరికా వెళ్లిపోయారు నదియా.